ఆ నిశి రేయిలో యశో 'పసుపు పచ్చటి చీర' ప్రక్రుతిలో కలిసిపోయింది కాని దాని ప్రాముఖ్యత నాకు అప్పుడే అర్ధమయింది;
"మీకు జవాబు రాస్తూ, ఇప్పుడు నేను కట్టుకున్న చీర చాలా విలువైంది. ఇది ఎప్పుడూ ఇక్కడకు వచ్చినతర్వాత కట్టుకోలేదు. ఏమిటా 'ఇది' అని ఆలోచిస్తున్నారా. గుర్తు తెచ్చుకోండి, మీరే చెప్పారే ఆనాడు; పసుపు పచ్చటి జార్జట్టు చీర కట్టుకుంటే నేను ముచ్చటగా ఉంటానని, అదే చీర ఇప్పుడు కట్టుకున్నాను," యశో రాసిన ఆ అక్షరాలు నాకు కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి.
నేను ఆ చీరకొంగుని సున్నితంగా నా మెడకు చుట్టుకుని యశో కేసి ఆప్యాయంగా చూస్తూ నా ముని వేళ్లతో దాని పల్లు స్పర్శని అనుభవిస్తూ కూచున్నాను.
"మీకు ఇది గుర్తు రావడం నా సౌభాగ్యం," అంది యశో.
''మనము ఇక్కడనుంచీ పారిపోతున్నామాయశో?" అన్నాను.
''ఇది పారిపోవడం కాదు బాదల్ బాబూ. మన జీవితంలో ఒక అధ్యాయం ముగిస్తునాం. అబ్బ. విపరీతమైన నిద్రవస్తూంది. పడుకుంటాను,'' అని, బండిలో గడ్డిమీద తలవాల్చి గాఢనిద్ర లోకి ఒరిగిపోయింది .
కొద్దిసేపు పోయిన తర్వాత గడ్డిలో ఏదో చప్పుడైనట్టుంది. నాలో భయంకరమైన అనుమానం ఒకటి ప్రవేశించింది. యశో గడ్డి మీద పడుకుంది. ఈ గడ్డిలో ఏదైనా పాడుకీటకముంటే ఏం కాను? గడ్డిలో పాములుంటాయి అంటారు. అలాంటిదేదయినా వుందా.... యశో అలా నిద్రపోతూండగా నాకీ ఆలోచనకలిగి వెంటనే ఆ గడ్డంతా చెయ్యి పెట్టి తడమడం మొదలుపెట్టాను. కటికాంధకారం. చేతికి ఏదో కాస్త మెత్తగా తగిలినట్లుంది. శరీరం ఒక్కసారి వణికింది. బయటికి విసిరేశాను. అది ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. బహుశా అది నా భ్రమే అయి వుంటుంది. పాము అయితే కుట్టకుండా అంతసేపు అలా ఎందుకు వుంటుంది? ఇంకా భయం పోలేదు. యశో తల నెమ్మదిగా ఎత్తి నా ఒడిలో పెట్టుకున్నాను. ఆ చీకటిలో తెల్లటి ఆమె ముఖం వజ్రంలా తళ తళ మెరుస్తూంది. ఎంత అందంగా ప్రశాంతంగా వుంది.
బయట అంతా కటిక చీకటి. భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, ఎడ్ల మెడలోంచి గంటలు చప్పుడు చేస్తున్నాయి. వుండి వుండి దూరం నుంచీ జంబూకపు కూతలు వినపడుతున్నాయి. ఆకాశం నిర్మలంగా వుంది. గగనాన్ని తూట్లుపొడుస్తూ నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ వుల్కలు పచారులు చేస్తున్నాయి. చందమామకు అది సెలవు దినం కామోసు. ఎక్కడా అలికిడిలేదు.
YOU ARE READING
క్షంతవ్యులు
Romanceతొలినవలని మొదటి ముద్దుతో పోల్చడం అతిశయోక్తి కాదు. ఈ 1956 నవల నేటి భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది. చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు. కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కో...